
- దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వేట్టువం’ సినిమా సెట్‌లో ప్రమాదం
- స్టంట్‌మ్యాన్ ఎస్ఎం రాజు ప్రమాదవశాత్తూ మృతి
- ఈ విషాదకర ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న స్టంట్‌మ్యాన్‌ల భద్రతాపై ఆందోళన
- ఈ నేపథ్యంలో 650 మంది స్టంట్‌మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ చేయించిన అక్షయ్ కుమార్
ఈ నెల 13న దర్శకుడు పా. రంజిత్ తెరకెక్కిస్తున్న ‘వేట్టువం’ సినిమా సెట్‌లో స్టంట్‌మ్యాన్ ఎస్ఎం రాజు ప్రమాదవశాత్తూ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న స్టంట్‌మ్యాన్‌లు, స్టంట్‌వుమెన్‌ల భద్రతా సమస్యలను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో ఉన్న సుమారు 650 మంది స్టంట్‌మ్యాన్‌లు, స్టంట్‌వుమెన్‌లకు ఇన్సూరెన్స్ చేయించారు. దీంతో అక్షయ్ మంచి మనసు పట్ల ప్రశంసలు కురుస్తున్నాయి.
సినిమా సెట్‌లో రాజు విషాద మరణంతో ఆందోళన చెందిన అక్షయ్ కుమార్ వందలాది మంది సిబ్బందికి ఇలా ఆరోగ్య, ప్రమాద కవరేజీని అందించారు. ‘ఓఎంజీ 2’, ‘ధడక్ 2’, ‘జిగ్రా’చిత్రాలకు పనిచేసిన ఒక అనుభవజ్ఞుడైన స్టంట్ ప్రొఫెషనల్ అక్షయ్ ఉదారతకు కృతజ్ఞతలు తెలిపారు. హిందూస్తాన్ టైమ్స్‌తో ఆయన మాట్లాడుతూ, “అక్షయ్ సార్‌కు ధన్యవాదాలు. బాలీవుడ్‌లో దాదాపు 650 నుంచి 700 మంది స్టంట్‌మెన్, యాక్షన్ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు. ఈ పాలసీలో రూ. 5 నుంచి రూ. 5.5 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స ఉంటుంది. గాయం సెట్‌లో జరిగినా లేదా వెలుపల జరిగినా” అని అన్నారు.