
- పార్టీ కోసం పని చేస్తూ టిక్కెట్ ఎందుకు ఆశించకూడదన్న అంజన్ కుమార్
- తన కొడుకుకు ఎంపీ టిక్కెట్ ఊరికే రాలేదన్న కాంగ్రెస్ నేత
- బీసీ సామాజిక వర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్నానన్న అంజన్ కుమార్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో తాను కూడా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నందున టిక్కెట్ ఆశించే హక్కు తనకు ఉందని ఆయన అన్నారు. తన కుమారుడు సైతం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, అందుకే ఎంపీగా ఎన్నికయ్యారని, అతనికి టిక్కెట్ ఊరికే రాలేదని ఆయన గుర్తు చేశారు.
బీసీ సామాజిక వర్గం నుంచి తాను టిక్కెట్ ఆశిస్తున్నానని అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తమ ఇంట్లో తండ్రి కొడుకులిద్దరం పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ, వేతనం మాత్రం ఒక్కరికే వస్తోందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి చర్చల సమయంలో తనకు అన్యాయం జరగదని అధిష్ఠానం హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.