తాజా వార్తలు

అంతర్జాతీయ క్రికెట్‌కు విండీస్ విధ్వంస‌క‌ర ఆట‌గాడు రిటైర్మెంట్

Andre Russell Announces Retirement From International Cricket
  • అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆండ్రీ రస్సెల్
  • ఆసీస్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల‌కు ప్రాతినిధ్యం
  • సబీనా పార్క్‌లో జరిగే మొదటి రెండు మ్యాచ్‌లు ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
వెస్టిండీస్ విధ్వంస‌క‌ర‌ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా అత‌డు మొదటి రెండు మ్యాచ్‌లు ఆడున్నాడు. ఇవే ర‌స్సెల్ విండీస్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వ‌హించ‌నున్న‌ చివరి మ్యాచ్‌లు. 37 ఏళ్ల రస్సెల్ కు విండీస్ క్రికెట్ బోర్డు ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఎంపిక చేసింది. త‌న‌ సొంత మైదానం జమైకాలోని సబీనా పార్క్‌లో జరిగే మొదటి రెండు మ్యాచ్‌లు ఆడి, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పల‌క‌నున్నాడు. విండీస్ క్రికెట్ అతని రిటైర్మెంట్‌ను ధ్రువీక‌రించింది.

“వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గర్వించదగ్గ విజయాలలో ఒకటి. నేను చిన్నప్పుడు ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదు. కానీ మ‌నం ఎంత ఎక్కువగా ఆడటం, క్రీడను ప్రేమించడం ప్రారంభిస్తే, మ‌నం ఏమి సాధించగల‌మో గ్రహిస్తాం. ఇది నన్ను మరింత మెరుగ్గా మారడానికి ప్రేరేపించింది. నేను మెరూన్ రంగులో ఒక ముద్ర వేసి ఇతరులకు ప్రేరణగా మారాలని కోరుకున్నాను.

నేను విండీస్ తరపున ఆడటం ఇష్టపడతాను. అలాగే నా కుటుంబం, స్నేహితుల ముందు ఇంట్లో ఆడటం నాకు చాలా ఇష్టం. అక్కడ నేను నా ప్రతిభను ప్రదర్శించడానికి, మరింత నాణ్యమైన‌ ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం లభిస్తుంది. కరేబియన్ నుంచి వస్తున్న తదుపరి తరం క్రికెటర్లకు రోల్ మోడల్‌గా ఉంటూనే నా అంతర్జాతీయ కెరీర్‌ను ఉన్నతంగా ముగించాలనుకుంటున్నాను” అని రస్సెల్ ఒక ప్రకటనలో తెలిపాడు.

2019 నుంచి రస్సెల్ తన దేశం తరపున ప్రత్యేకంగా టీ20 ఆటగాడిగా ఉన్నాడు. అతను విండీస్‌ తరపున 84 టీ20లు ఆడాడు. 22.00 సగటుతో 1,078 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత‌ని అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు 71. అలాగే ర‌స్సెల్‌ 30.59 సగటుతో 61 వికెట్లు కూడా పడగొట్టాడు.

కాగా, రస్సెల్ వెస్టిండీస్ తరఫున ఒకే ఒక టెస్ట్ ఆడాడు. అలాగే 56 వన్డేల‌కు కూడా ప్రాతినిధ్యం వ‌హించాడు. వీటిలో 27.21 సగటుతో 1,034 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శ‌త‌కాలు ఉన్నాయి. వన్డేల్లో అతను 31.84 సగటుతో 70 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ బౌలింగ్ గణాంకాలు 4/35.

ఇక‌, రస్సెల్ అనేక టీ20 లీగ్‌లలో భారీ పాత్ర పోషించాడు. మొత్తంగా 561 మ్యాచ్‌ల్లో 26.39 సగటు, 168 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 9,316 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అటు బౌలర్‌గా అతను 25.85 సగటుతో 485 వికెట్లు పడగొట్టాడు.

Show More

Related Articles

Back to top button