
- తీవ్రగాయాలతో పసికందు మృతి
- బస్సును ఆపి ప్రయాణికులను చెక్ చేసిన పోలీసులు
- 19 ఏళ్ల యువతితో పాటు యువకుడి అరెస్ట్
- బిడ్డను పెంచే స్తోమత లేక పారేశామన్న యువకుడు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పర్భణికి చెందిన రితిక ధీరే, అల్తాఫ్ షేక్ లు కొంతకాలంగా పూణేలో జీవిస్తున్నారు. ఈ క్రమంలో రితిక గర్భం దాల్చింది. తాజాగా సోమవారం రాత్రి నిండు గర్భిణి రితికతో అల్తాఫ్ పర్భణి బయలుదేరాడు. స్లీపర్ కోచ్ లో రాత్రంతా ప్రయాణించారు. తెల్లవారుజామున రితికకు పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి. పథ్రి- సేలు రోడ్డులో ప్రయాణిస్తుండగా బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను అల్తాఫ్ ఓ గుడ్డలో చుట్టి కిటికీలో నుంచి బయటకు విసిరేశాడు.
బస్సులో నుంచి ఏదో వస్తువు పడడం చూసిన స్థానికుడు దగ్గరికి వెళ్లి పరిశీలించాడు. అందులో పసిబిడ్డను చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. విషయం తెలిసిన వెంటే స్పందించిన పోలీసులు ఆ బస్సును ఆపి రితిక, అల్తాఫ్ లను అదుపులోకి తీసుకున్నారు. చికిత్స కోసం రితికను ఆసుపత్రిలో చేర్పించి అల్తాఫ్ ను విచారించారు. తాము భార్యాభర్తలమని, బిడ్డను పెంచే స్తోమత లేకపోవడం వల్లే ఈ పని చేశామని అల్తాఫ్ చెప్పుకొచ్చాడు. అయితే, వారిద్దరూ భార్యాభర్తలు అనేందుకు ఎలాంటి ఆధారం చూపలేకపోయాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.