
- అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు భూసేకరణపై ఎన్‌హెచ్ఏఐ కసరత్తు
- 140 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం
- భూసేకరణ, అటవీ భూముల కోసం రూ.5,300 కోట్ల భారీ వ్యయం అంచనా
- ఐదు జిల్లాల్లో 3,400 హెక్టార్ల భూమి, 250 హెక్టార్ల అటవీ భూమి అవసరం
- 189 కి.మీ. ప్రాజెక్టును 8 నుంచి 10 ప్యాకేజీలుగా చేపట్టే యోచన
- కృష్ణా నదిపై రెండు భారీ వంతెనల నిర్మాణానికి ప్రణాళిక
ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణకే దాదాపు రూ.5,000 కోట్లు, అటవీ భూముల కోసం మరో రూ.300 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఎన్‌హెచ్ఏఐ ప్రాథమికంగా అంచనా వేసింది. మొత్తం 189 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ ఓఆర్‌ఆర్.. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా వెళ్లనుంది. దీనికోసం సుమారు 3,400 హెక్టార్ల ప్రభుత్వ, పట్టా, అసైన్డ్ భూములతో పాటు 250 హెక్టార్ల అటవీ భూములు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. గతంలో 70 మీటర్ల వెడల్పు ప్రతిపాదనతో పోలిస్తే భూమి అవసరాలు, బడ్జెట్ రెట్టింపు కావడం గమనార్హం.
ఈ భారీ ప్రాజెక్టును 8 నుంచి 10 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టాలని భావిస్తున్నారు. సగటున 25 కిలోమీటర్లకు ఒక ప్యాకేజీ చొప్పున పనులు కేటాయించనున్నారు. కృష్ణా నదిపై అమరావతికి సమీపంలో మున్నలూరు-ముత్తాయిపాలెం మధ్య ఒకటి, వల్లూరుపాలెం-వల్లభాపురం మధ్య మరొకటి చొప్పున రెండు భారీ వంతెనలను నిర్మించనున్నారు. ఈ వంతెనలను వేర్వేరు ప్యాకేజీలుగా చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎన్‌హెచ్ఏఐ అధికారులు సిద్ధం చేస్తున్న సమగ్ర నివేదికను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. అక్కడ వివిధ కమిటీల ఆమోదం తర్వాత కేంద్ర మంత్రివర్గం తుది అనుమతి ఇవ్వనుంది. అనంతరం భూసేకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఆరు జాతీయ రహదారులను అనుసంధానించే ఈ ఓఆర్‌ఆర్‌కు కొత్త జాతీయ రహదారి నంబర్‌ను కేటాయించాలని కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు.