తాజా వార్తలు

‘విశ్వంభ‌ర’ స్టోరీ లైన్ ఇదే: ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ‌

Vishwambhara Storyline Revealed by Director Vasishta
  • చిరంజీవి, వ‌శిష్ఠ కాంబోలో ‘విశ్వంభర’
  • ఈ మూవీ స్టోరీపై ఇప్పటికే ఎన్నోసార్లు రూమర్స్ హ‌ల్‌చ‌ల్
  • తాజాగా వాటికి చెక్‌ పెడుతూ స్టోరీ లైన్ చెప్పేసిన దర్శకుడు
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, బింబిసారా ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా స్టోరీపై ఇప్పటికే ఎన్నోసార్లు రూమర్స్ హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే, తాజాగా వాటికి చెక్‌ పెడుతూ దర్శకుడు వశిష్ఠ దీని స్టోరీ లైన్ ఏంటో చెప్పేశారు.

వ‌శిష్ఠ మాట్లాడుతూ… “మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. పైన 7, కింద 7 ఉంటాయి. ఇప్పటివరకూ ఈ 14 లోకాలను ఎవరికి తోచిన విధంగా వాళ్లు చూపించారు. యమలోకం, స్వర్గ, పాతాళలోకం … ఇలా అన్నిటినీ చూశాం. విశ్వంభరలో నేను వీటన్నిటినీ దాటి పైకి వెళ్లా. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని ఇందులో చూపించా. ఈ 14 లోకాలకు అదే బేస్‌. హీరో డైరెక్ట్‌గా ఆ లోకానికి ఎలా వెళతాడు? హీరోయిన్‌ను ఎలా తిరిగి తెచ్చుకుంటాడు?” అనేదే ఈ సినిమా స్టోరీ అని దర్శకుడు వివరించారు.

ఇక‌, వాస్తవ ప్రపంచాన్ని తలపించేలా సెట్స్‌ వేసినట్లు గతంలోనే దర్శకుడు ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు స్టోరీ లైన్ కూడా చెప్పేశారు. దీంతో ఈ సినిమా విడుదల కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే టాప్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు దీనికోసం పనిచేస్తున్నాయ‌ని స‌మాచారం. ఇందులో భాగంగానే ప్రపంచస్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించాలన్నదే తపనతో పనిచేస్తున్నట్లు వశిష్ఠ ఇప్పటికే వెల్ల‌డించారు. వీఎఫ్‌ఎక్స్‌ సాయంతో సరికొత్త ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించామని, చిరును ఇప్పటివరకూ చూడని పాత్రలో చూస్తారని ఆయ‌న అన్నారు.

కాగా, ఈ మూవీలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరితో పాటు బాలీవుడ్‌ నటి మౌనీరాయ్‌తోనూ చిరు స్టెపులు వేయనున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ఖైదీ’లోని రగులుతోంది మెగలిపొద.. పాట రీమేక్‌కు మౌనీరాయ్‌తో కలిసి చిరంజీవి మరోసారి మెస్మ‌రైజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Show More

Related Articles

Back to top button