
- బీజేపీ మద్దతు లేకుండా రాజాసింగ్ ఎమ్మెల్యే అయ్యారా అని మాధవీలత ప్రశ్న
- ఎన్నికల్లో రాజాసింగ్ తనకు సహకరించలేదని ఆరోపణ
- గోషామహల్ లో రాజాసింగ్ కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని వ్యాఖ్య
ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆ పార్టీ నాయకురాలు హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవీలత విమర్శలు గుప్పించారు. బీజేపీ మద్దతు లేకుండానే రాజాసింగ్ ఎమ్మెల్యేగా గొలుపొందారా? అని ప్రశ్నించారు. కార్పొరేటర్ గా ఉన్న రాజాసింగ్ ను ఎమ్మెల్యే చేసింది బీజేపీనే అని చెప్పారు. బీజేపీ గురించి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని అన్నారు. ఇతర మతాల వారిని, మహిళలను దూషించడమే హిందుత్వమా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు రాజాసింగ్ సహకరించలేదని మాధవీలత విమర్శించారు. ఎంపీ అభ్యర్థిగా మగాళ్లే దొరకలేదా? అంటూ తన గురించి హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. గోషామహల్ లో రాజాసింగ్ కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. మాధవీలత బలహీనురాలు కాదని చెప్పారు. గోషామహల్ స్థానాన్ని తనతో భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తుండటం తన అదృష్టమని అన్నారు. గోషామహల్, జూబ్లీహిల్స్ ఎక్కడ పోటీ చేయమన్నా బరిలోకి దిగేందుకు తాను సిద్ధమని చెప్పారు.