తెలంగాణన్యూస్:

- విలన్ గా తెలుగులో విపరీతమైన క్రేజ్
- నటుడిగా ఇతర భాషలలోను బిజీ
- ఇటీవల సాఫ్ట్ రోల్స్ చేసిన సముద్రఖని
- తెలుగులో తగ్గుతూ వస్తున్న జోరు
సముద్రఖని .. తెలుగు తెరకి విలక్షణమైన విలనిజాన్ని పరిచయం చేసిన నటుడు. రచయిత .. దర్శకుడు కూడా. ఒక వైపున నటిస్తూనే ఆయన మిగతావి చక్కబెడుతూ ఉంటాడు. నటుడిగా తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఆయన బిజీ. ఇక ఏ మాత్రం కాస్త ఎక్కువ గ్యాప్ దొరికినా ఆయన మెగాఫోన్ పట్టేస్తూ ఉంటాడు. అలాంటి ఆయనను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకుని చాలా కాలమే అయింది.
ఒక వైపున పెద్ద సినిమాలలో ప్రకాశ్ రాజ్ .. ఓ మాదిరి బడ్జెట్ కలిగిన సినిమాలలో రావు రమేశ్ తమ విలనిజాన్ని పరుగెత్తిస్తూ ఉండగా, సముద్రఖని ఎంట్రీ ఇచ్చాడు. విలనిజం చూపించడానికి సముద్రఖని ప్రత్యేకమైన అలంకారాలేవీ సెట్ చేసుకోలేదు. సింపుల్ గా కనిపిస్తూ .. చురుకైన చూపులతోనే ఆయన తన విలనిజాన్ని పండిస్తూ వెళ్లాడు. తక్కువ డైలాగులను పదునుగా పలకడం ఆయన ప్రత్యేకత. అలాంటి ఒక వైవిధ్యంతో ఆయన ఆకట్టుకున్నాడు.
అయితే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా పవర్ఫుల్ పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన, ఈ మధ్య కాలంలో ఆ స్థాయి విలనిజాన్ని ఆవిష్కరించే పాత్రలు చేయలేదనే చెప్పాలి. చిన్న సినిమాలు .. సాఫ్ట్ రోల్స్ చేయడం ఒక కారణమైతే, ఇతర భాషల్లో తాను ప్రధానమైన పాత్రగా సినిమాలు చేయడం అందుకు కారణంగా చెప్పుకోవాలి. నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనేది సముద్రఖని అభిప్రాయమే అయినప్పటికీ, ఆయనను పవర్ఫుల్ విలన్ రోల్స్ లోనే ఇక్కడి ప్రేక్షకులను చూడాలనుకుంటున్నారు.