హోమ్

లేని శాఖకు 20 నెలలు మంత్రిగా పనిచేసిన ఆప్‌ నేత.. ఇదో జోక్‌ అంటూ బీజేపీ విమర్శ

Punjab | లేని శాఖకు 20 నెలలు మంత్రిగా పనిచేసిన ఆప్‌ నేత.. ఇదో జోక్‌ అంటూ బీజేపీ విమర్శ

రాష్ట్రంలో ఆసక్తికర ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆప్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్‌ మంత్రి ఒకరు ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంట. దీన్ని సవరించేందుకు పంజాబ్ ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ విషయం బయటపడింది.

మూడేండ్ల క్రితం పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2023లో మంత్రివర్గ పునర్వవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆప్‌ సీనియర్‌ నేతల్లో ఒకరైన కుల్‌దీప్ సింగ్ ధలివాల్‌ (Kuldeep Singh Dhaliwal)కు రెండు శాఖలు ఎన్ఆర్ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ (Department of Administrative Reforms) బాధ్యతలు అప్పగించింది. 2024 సెప్టెంబర్‌లో మరోసారి పునర్వ్యవస్థీకరణ జరిపింది. అవే శాఖలు ఆయనకు కొనసాగించింది. అయితే, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేదని గ్రహించి తాజాగా మార్పులు చేసింది.

ఇందుకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదల చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదెక్కడి విడ్డూరం అంటూ స్థానిక రాజకీయ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ అంశంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. పంజాబ్‌లో పాలనను ఆప్‌ ఒక ‘జోక్‌’లా మార్చేసిందంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి బాధ్యతలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. లేని శాఖను ఒక మంత్రి నిర్వహిస్తున్నారనే విషయం ముఖ్యమంత్రికి తెలియకపోవడం.. అక్కడ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.

Show More

Related Articles

Check Also
Close
Back to top button