ఆ శాస్త్రములలో వేదాంతము సాత్త్వికము మీమాంస రాజసము న్యాయశాస్త్రము హేతువాద యుక్తము అగుటచే తామసము నై యొప్పుచుండును. పురాణములు త్రిగుణములతో త్రివిధములై కథలతో కూడియుండును. పంచలక్షణములతో వెలయు ఆ పురాణములు నీవు చెప్పితివి. వానిలో శ్రీ దేవీభాగవత మైదవది. పుణ్యప్రదమైనది. వేదసదృశము. సర్వ లక్షణ సంయుతము. అన్నిటి కంటె శ్రీ భాగవతము ముముక్షువులకు ముక్తిని ధర్మాత్ములకు ధర్మఫలమును సకాములకు కామఫలమును నొసంగగల దగుటచే పరమాద్భుతమైనది. అట్టి దానిని నీవు నామగ్రహణ మాత్రమున చెప్పితివి. ఇపుడా దివ్యమై శుభకరమైన శ్రీ దేవీ భాగవత పురాణోత్తమమును ఆదరముతో మాకు విశదముగ నభివర్ణింపుము. దాని నిచటి ద్విజులెల్లరము విన వేడుకపడుచున్నారము. ధర్మజ్ఞుడవగు సూతా! గురుభక్తి సత్త్వగుణము గలిగిన వాడవగుటచే నీవే వ్యాసముని ప్రోక్తమైన పురాణ వాఙ్మయమును బాగుగ నెఱింగియున్నావు అనునది నీయందలి విశేషము. పురాణతత్త్వ సర్వస్వము నెఱిగిన వాడవు. నీ నోట నెన్నియో పురాణములను వింటిమి. కాని మా కిపుడు అమృత పానముచే నమరులకు వలె మాకు అంత మాత్రమున తృప్తి గలుగుటలేదు. ఎన్నటికిని ముక్తి నీయజాలని యమృతము గ్రోలుట వ్యర్థమే గదా! ఎందువలన ననగా, భాగవతామృతమును త్రాగినచో నరుడు బంధమునుండి వెంటనే విముక్తు డగును. మే మమృతపానము గోరి యెన్నెన్నో జన్నము లొనరించితిమి. కాని యీనాటికిని మాకు పూర్తిగ శాంతి చేకూరలేదు. యాగములకు ఫలితముగ సర్వ ప్రాప్తిగలుగును. కాని యా స్వర్గమునుండి తిరిగి పతనము గలుగును. ఈ విధముగ నీ సంసార చక్రమునందు నిరంతరముగ భ్రమణము గలుగుచునేయుండును. సత్త్వ రజస్తమోరూపమగు నీ కాల చక్రమునబడి తిరుగుచున్న నరులకు తత్త్వజ్ఞానము లేకుండ నెన్నటికిని ముక్తి కలుగదు. కనుక ముముక్షువులకు ప్రియమై రహస్యమై ముక్తిప్రదమై పవిత్రమై సర్వరస భరితమై యొప్పారు శ్రీ దేవీభాగవత మహాపురాణమును మాకు తేటతెల్ల మొనరించుము.
ఇది పదునెనిమిదివేల శ్లోకములుగల శ్రీ దేవీభాగవత మహాపురాణమందలి
ప్రథమ స్కంధమందు శౌనక కృత ప్రశ్నమను ప్రథమాధ్యాయము.🙏