
- హిందీ భాషపై రాజకీయ రగడ
- హిందీ నేర్చుకోవడంలో తప్పులేదన్న జగన్
- అయితే విద్యార్థుల భవిష్యత్ కోసం ఇంగ్లీషుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వెల్లడి
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ, “పేద పిల్లలకు పోటీతత్వాన్ని పెంపొందించేందుకు హిందీని ఒక భాషగా బోధించవచ్చు. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరిగితే విద్యార్థులు గ్లోబల్ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది” అని అన్నారు. మాతృభాషను తప్పనిసరిగా మొదటి భాషగా ఉంచాలని, రెండవ భాషగా హిందీ లేదా ఇతర భాషలను ఎంచుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. జగన్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, తాను చదువుకున్న పాఠశాలలో హిందీని మొదటి భాషగా నేర్చుకున్నానని, అయినప్పటికీ ఇంగ్లీష్ విద్య ద్వారా విద్యార్థులు ఎక్కువ అవకాశాలను సాధించవచ్చని పేర్కొన్నారు.
“ఇంగ్లీష్ మీడియం విద్యా వ్యవస్థ కొత్త మార్పుకు నాంది పలుకుతుంది. ఇది విద్యార్థులకు బంగారు బాట వేస్తుంది” అని ఆయన ఉద్ఘాటించారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్డీఏ యేతర పక్షాలు చేస్తున్న వాదనలను జగన్ సమర్థించారు. అయితే, భాషా వివాదంపై రాజకీయ రంగు పులుముకోవడం కంటే, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విద్యా విధానాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి, “ఇప్పటికైనా మేల్కొని, తప్పులను సరిదిద్దుకోవాలి” అన్నారు.