- ఆయన నడవగలుగుతున్నారని వెల్లడి
- అలాగే బాగానే మాట్లాడగలుగుతున్నారన్న డాక్టర్లు
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై బాంద్రాలోని ఆయన నివాసంలో ఓ దుండగుడి చేతిలో గాయపడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సైఫ్ హెల్త్ బులిటెన్‌ను ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని డాక్టర్లు వెల్లడించారు. తనంతట తానుగా సైఫ్ నడవగలుగుతున్నారని తెలిపారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన లీలావతి ఆసుపత్రి వైద్యులు.. “సైఫ్ ఆరోగ్యం మెరుగవుతోంది. ఆయన బాగానే మాట్లాడగలుగుతున్నారు. అలాగే నడవగలుగుతున్నారు. వెన్ను నుంచి కత్తి మొనను తొలగించాం. గాయాల కారణంగా ఇన్‌ఫెక్షన్ అయ్యే ప్రమాదం అధికంగా ఉంది. అందుకే ఆయనకు కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని చెప్పాం. సైఫ్‌ను ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌లోకి మారుస్తాం. కొన్ని రోజుల తర్వాత పరిస్థితిని బట్టి డిశార్జ్ చేస్తాం” అని వైద్యులు చెప్పుకొచ్చారు.