విఠోబా విసుగంది, “చాలా బాగున్నది. ఎవరి ముక్కునకు సూటిగా వారు చెప్పుట సహ జము. నీ పలుకులు యుక్తమైనవి కావు. ఇతరులు విన్న నవ్వుదురు. వచ్చిన దారిబట్టి వెళ్ళుము. నిలిచినచో నీ పరువు దక్కదు. నేను తీర్థయాత్రాపరుడను. సంసారమునందు ఇచ్ఛ లేనివాడను. నీవు నన్ను పీడించుట వలన ప్రయోజనము లేదు. మాట విని యింటికి వెళ్ళుము. ఇచట నిలువకుము!” అని పలికెను.
అందులకు రుక్మాబాయి, “స్వామీ! పతివ్రత అన్యులను తలంపదు. అట్లు తలచినచో అది గాడిదెయేగానీ, ఆడది కాదు. నీవు నాకు భర్తవనియూ, నేను నీకు భార్యననియూ మనశ్శుద్ధిగా నిశ్చయించిన, వ్యతిరేకముగా నడుచుకొనుట ధర్మమా? నిన్ను తిరస్కరించి మఱియొకని వరించునంతటి పాపాత్మురాలను గాను. ఈసంగతి విన్న ఎవ్వరైనా నవ్వుదురంటివి. పలువురు నవ్వునంత దాకా మనమిచ్చట వుండవలసిన పనిలేదు. వెళ్ళుదము రమ్ము!” అనెను.విఠోబా, “వివేకహీనురాలా! నోటికి వచ్చినట్లు వదరుచున్నావు. నీ సుఖమును నీవు తలంచుచున్నావు. ఆత్మబుద్ధి సుఖకరమనియూ, గురుబుద్ధి అధిక సుఖకరమనియూ, పరబుద్ధి వినాశకరమనియూ, స్త్రీబుద్ధి ప్రళయంకరమనియూ పెద్దలందురు. తల్లిదండ్రులను మోసగించి, దారిని పోవువానితో దొంగతనముగా దేశాంతరము లేచిపోవుటకు ప్రయత్నించు నీవంటి పాపాత్మురాలితో మాటాడిననూ పాపమే. ఇక తిరిగిచూడక వెడలిపొమ్ము” అని ధిక్కరించి పలికెను.
0 Less than a minute