తెలంగాణ

విమాన ఇంజిన్ వైఫల్యాలు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు

తెలంగాణన్యూస్:

DGCA Report Key Issues in Aircraft Engine Failures
  • ఐదేళ్ల కాలంలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు
  • జనవరి 1, 2024 నుంటి మే 31, 2025 మధ్య కాలంలో 11 మే డే కాల్స్
  • అన్ని సమయాల్లో పైలట్లు సమస్యను పరిష్కరించకపోవచ్చునన్న డీజీసీఏ నివేదిక
భారతదేశంలో గత ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు తమ విమానాల ఇంజిన్‌లు, ఇంధన స్విచ్‌లు మొదలైన వాటిపై అప్రమత్తమయ్యాయి. ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డీజీసీఏ ఒక నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదికలో కొన్ని కీలక అంశాలను వెల్లడించింది. జనవరి 1, 2024 నుంచి మే 31, 2025 మధ్య కాలంలో 11 మే డే కాల్స్ నమోదైనట్లు తెలిపింది. మే డే కాల్స్ వచ్చినప్పటికీ పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి ఆయా విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదాలు తప్పాయని పేర్కొంది. చాలా వరకు విమానాల్లో పైలట్లు సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ, అన్ని సమయాల్లోనూ అలాంటి అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడింది.

ఇంధన ఫిల్టర్లు బ్లాక్ కావడం, టర్బైన్ లోపాలు, ఇంధన కాలుష్యం, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వంటివి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని భారత పైలట్ల సమాఖ్య అధ్యక్షుడు కెప్టెన్ సీఎస్ రాంధవా పేర్కొన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ సేఫ్టీ డైరెక్టర్ జోసెఫ్ మాట్లాడుతూ, విమానాలలో సాంకేతిక సమస్యలు తలెత్తడం ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా జరుగుతున్నప్పటికీ, భారత విమానాల్లో తరుచూ సమస్యలు తలెత్తుతుండటం ఆందోళనకరమని అన్నారు.

ఇంధన స్విచ్‌ల వైఫల్యం కారణంగానే ఎయిరిండియా విమానం కూలినట్లు ప్రాథమిక నివేదిక వెల్లడించిన నేపథ్యంలో, భారత విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న లోపాలపై డీజీసీఏ ప్రత్యేక దృష్టి సారించినట్లు జోసెఫ్ తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత బోయింగ్ విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయాలని ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.

Show More

Related Articles

Back to top button