తాజా వార్తలు

లిక్క‌ర్ స్కామ్‌.. మాజీ సీఎం భూపేశ్ భగేల్ ఇంట్లో ఈడీ సోదాలు

Bhupesh Baghel Residence Raided by ED in Liquor Scam Case
  • భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్యకు లిక్కర్ స్కామ్ తో లింకులు
  • మనీలాండరింగ్ కు పాల్పడినట్టు చైతన్యపై ఆరోపణలు
  • మార్చి 10న కూడా వీరి నివాసంలో దాడులు
ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్ కు లిక్కర్ స్కామ్ తో లింకులు ఉన్న నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి.  లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును మనీలాండరింగ్ చేసినట్టు చైతన్య భగేల్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దుర్గ్ జిల్లాలోని బిలాయి పట్టణంలో ఉన్న భగేల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. భూపేశ్, చైతన్య ఇద్దరూ ఒకే చోటు ఉంటున్నారు. మార్చి 10న కూడా వీరి నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి.

మరోవైపు ఈడీ దాడులను విమర్శిస్తూ భూపేశ్ భగేల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు అని… రాయ్ గఢ్ జిల్లా తమ్నార్ తహిసిల్ లో అదానీ గ్రూపు బొగ్గు గని కోసం చెట్లను నరికేస్తున్నారని, ఆ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తామనే తన ఇంటికి ఈడీని పంపారని మండిపడ్డారు.

లిక్కర్ సిండికేట్ నడిపిన వారికి సుమారు రూ. 2,100 కోట్ల లాభం ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ మంత్రి కవాసి లక్మాతో పాటు పలువురు నేతలు, అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు 205 ఆస్తులను అటాచ్ చేశారు. 2019 నుంచి 2022 మధ్య కాలంలో ఈ స్కామ్ జరిగిందని ఈడీ చెబుతోంది.

Show More

Related Articles

Back to top button