తెలంగాణన్యూస్:
రోబోలకు బందీలుగా రష్యన్ సైనికులు..
రోబోటిక్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్‌లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి.
ప్రపంచంలో ఇదే మొదటిసారి: ఉక్రెయిన్ కీవ్, జూలై 14: రోబోటిక్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిస్థాయి మానవరహిత సైనిక ఆపరేషన్‌లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి. యుద్ధ రంగంలో రోబోలు, డ్రోన్ల ద్వారా రష్యా బలగాలను నిర్బంధించినట్లు ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని ఖర్గీవ్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. భూమి మీద సాగించే యుద్ధంలో రిమోట్ సాయంతో నడిచే రోబోలు సైనికులుగా మారి శత్రు సైనికులను బంధించినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్‌ని ఉక్రెయిన్‌కి చెందిన ఎలైట్ థర్డ్ సెపరేట్ అసాల్ట్ బ్రిగేడ్ నిర్వహించింది. యుద్ధ రంగంలోకి చేరుకున్న రెండు రోబోలు రష్యన్ బంకర్‌పై దాడి చేసి బాంబులతో పేల్చివేశాయి. దీంతో రష్యన్ సైనికులు రోబోలకు లొంగిపోయారని ఉక్రెయిన్ సాయుధ దళం తెలిపింది. వారిని డ్రోన్ల పర్యవేక్షణలో ఉక్రెయిన్ భూభాగంలోకి తరలించినట్లు పేర్కొన్నది. అప్రత్యక్ష యుద్ధంలో సైనికులకు బదులుగా రోబోలను రంగంలోకి దించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ తన డ్రోన్, రోబోటిక్స్ కార్యక్రమాన్ని వేగంగా విస్తరించిందనడానికి తాజా పరిణామమే సాక్ష్యం.