
- ఏపీలో రాబోయే నాలుగేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
- అధికారులకు మంత్రి నారా లోకేశ్ దిశానిర్దేశం
- సంస్థలు త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచన
రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, జీసీసీలు, డేటా సెంటర్ల స్థాపనకు ఇప్పటివరకు 95 ప్రముఖ సంస్థలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు. ఈ సంస్థలు త్వరితగతిన తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూకేటాయింపులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించగా, ఈ సంస్థలు త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని లోకేశ్ సూచించారు.
ఇటీవలి బెంగళూరు పర్యటనలో ఏఎన్‌ఎస్‌ఆర్, సత్వ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు ఎంఓయూలు కుదుర్చుకున్నాయని, వీటి ద్వారానే యువతకు 35,000 ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఎంఓయూలు చేసుకున్న సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ యూనిట్లు ఏర్పాటు చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి వచ్చే చిన్న సంస్థల కోసం 26 జిల్లా కేంద్రాల్లో కో-వర్కింగ్ స్పేస్‌లను సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
త్వరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ప్రోత్సాహానికి తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. దీంతో పాటు విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను కూడా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎంల భాగస్వామ్యంతో కంపెనీ ఏర్పాటైందని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టిసారించాలని అన్నారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 400 ఎకరాల్లో నిర్మించదలపెట్టిన డ్రోన్ సిటీని ఏడాదిలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన ఎకో సిస్టమ్ కల్పించాలని అధికారులను ఆదేశించారు. బుడమేరు వరదల సమయంలో డ్రోన్‌ల సేవలు ఎంతగానో ఉపకరించాయని, వ్యవసాయం, పోలీసింగ్, వాతావరణం తదితర శాఖల్లో డ్రోన్‌ల వినియోగంపై నెలకు ఒక జిల్లాలో ఈవెంట్లు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.
మనమిత్ర సేవలు మరింత సులభతరం
పౌరసేవల్లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృతపరచాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. మొత్తం 702 సేవలలో 535 సేవలను ఇప్పటికే మనమిత్ర ద్వారా అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి చెక్ పెట్టాలని, కుల ధృవీకరణ పత్రంతో సహా విద్యాసంబంధిత అన్ని రకాల సర్టిఫికెట్లు బ్లాక్ చైన్‌తో అనుసంధానం చేసి మనమిత్ర ద్వారా సులభతరంగా పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రాష్ట్రంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి స్కూలుకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ఎయిర్‌పోర్టుల్లో అంతరాయం లేని ఫోన్ కనెక్టివిటీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఐటీ అండ్ సీ స్పెషల్ సెక్రటరీ సుందర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిశోర్, ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ సాయికాంత్ వర్మ, ఆర్టీజీఎస్ సీఓ ప్రకార్ జైన్, ఏపీటీఎస్ ఎండీ సూర్యతేజ, తదితరులు పాల్గొన్నారు.