
- భారత్ – పాక్ మధ్య అణు యుద్ధాన్ని ఆపానంటూ మరోమారు వ్యాఖ్య
- వర్తకంపై ఆంక్షల పేరుతో రెండు దేశాలపై ఒత్తిడి తెచ్చా
- రువాండా – కాంగోల మధ్య సుదీర్ఘ వివాదాన్నీ పరిష్కరించానని ట్రంప్ వెల్లడి
దేశాల మధ్య యుద్ధాలను ఆపడంలో తనను మించిన వారు లేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తన చాతుర్యంతో తప్పించానని చెప్పారు. భారత్ – పాకిస్థాన్ ల మధ్య అణు యుద్ధం జరిగే ప్రమాదాన్ని తానే తప్పించేశానని మరోమారు పేర్కొన్నారు. ఇటీవల ఆ రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయని, యుద్ధం ముదిరి అణ్వాయుధ ప్రయోగానికి దారి తీసే ముప్పు ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. దీంతో తాను జోక్యం చేసుకుని ఇరు దేశాలను గట్టిగా హెచ్చరించినట్లు తెలిపారు.
యుద్ధం ఆపకపోతే వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని, భవిష్యత్తులో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోబోమని ఒత్తిడి చేశానని వివరించారు. దీంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గాయని, ప్రపంచానికి మరో అణు యుద్ధ ముప్పు తప్పిందని ట్రంప్ తెలిపారు. రువాండా – కాంగోల మధ్య గడిచిన 30 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం గురించి ప్రపంచం మొత్తానికీ తెలుసని ట్రంప్ గుర్తుచేశారు. ఇందులో సుమారు 70 లక్షల మంది చనిపోయారని ట్రంప్ చెప్పారు. ఈ వివాదాన్ని కూడా తాను సమసిపోయేలా చేశానని చెప్పుకున్నారు. ఈమేరకు సోమవారం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.