- 15 మంది సభ్యులతో కూడిన జట్టులో బుమ్రాకు చోటు దక్కడం ఖాయమంటూ ‘ఇండియా టుడే’ కథనం
- కానీ, అతని ఫిట్‌నెస్ ఆధారంగా మాత్రమే టోర్నీలో ఆడే అవకాశం
మరికాపేట్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ఖరారు చేయనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించనున్నారు. అయితే, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఐసీసీ టోర్నీలో ఆడడంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధత తొలిగిపోయినట్లు సమాచారం.
ఇండియా టుడే కథనం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రాను చేర్చడానికి బీసీసీఐ సిద్ధంగా ఉందట. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా వెన్నునొప్పితో బాధపడిన తర్వాత అతను ఈ టోర్నీలో ఆడతాడా లేదా అనే దానిపై ఎన్నో చర్చలు జరిగాయి. అయితే, బుమ్రా తన గాయం విషయమై వచ్చిన పుకార్లను కొట్టిపారేశాడు. నిరాధార ప్రచారాలను నమ్మొద్దంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
అయితే, అతనిని జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. కానీ, బుమ్రా టోర్నీలో పాల్గొనడం అనేది మాత్రం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని కథనం పేర్కొంది. “సెలక్టర్లు బుమ్రా ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి, తుది నిర్ణయం తీసుకోవడానికి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కనీసం ఒక మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నారు” అని ఇండియా టుడే కథనం తెలిపింది.
అలాగే సంజూ శాంసన్ జట్టులో చోటు దక్కకపోవచ్చని, విజయ్ హజారే ట్రోఫీ (వీహెచ్‌టీ)లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కరుణ్ నాయర్‌ను మాత్రం సెలక్షన్ టీమ్ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కరుణ్ నాయర్ వీహెచ్‌టీలో 8 మ్యాచ్‌ల్లో 752 పరుగులతో రాణించాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేశాడు. అయితే, “ఒక ప్రధాన టోర్నమెంట్‌కు ముందు 2017లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన నాయర్‌ను రీకాల్ చేయడం మంచి నిర్ణయం కాదని సెలక్టర్లు భావిస్తున్నారని” కథనం పేర్కొంది.
అటు వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఇంగ్లండ్‌తో టీ20ల కోసం జట్టులో చోటు దక్కడం ఖాయం. కానీ, ఇంగ్లండ్‌తో వన్డేలు, ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అతడు ఎంపిక అయ్యే అవకాశం లేదు. దీనికి ఒక కారణం అతను విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడం. జాతీయ జట్టుకు ఆడాలనుకునే ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో సెలక్టర్లు అతని గైర్హాజరుపై సంతోషంగా లేరని కథనం పేర్కొంది.