
- బెంగళూరులో తుదిశ్వాస విడిచిన నటీమణి బి. సరోజా దేవి
- సంతాపం తెలియజేసిన ప్రధాని మోదీ
- భారతీయ సినిమా, సంస్కృతికి ఆమె ఐకాన్ గా నిలిచిపోతారంటూ ట్వీట్
అలనాటి ప్రముఖ నటి బి. సరోజా దేవి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె భారతీయ సినిమా మరియు సంస్కృతికి ఒక అసాధారణ చిహ్నంగా ఎప్పటికీ గుర్తుండిపోతారని ఆయన పేర్కొన్నారు.
“ప్రముఖ సినీ నటి బి. సరోజా దేవి గారి మరణ వార్త నన్ను ఎంతగానో కలిచివేసింది. ఆమె విభిన్నమైన పాత్రల ద్వారా అనేక తరాల ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. వివిధ భాషల్లో, విభిన్న ఇతివృత్తాలతో ఆమె చేసిన సినిమాలు ఆమె బహుముఖ ప్రతిభను చాటాయి. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని ప్రధానమంత్రి మోదీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
బి. సరోజా దేవి తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించి, ‘అభినయ సరస్వతి’గా పేరు పొందారు. ఆమె మరణం భారతీయ సినిమా రంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు తమ సంతాప సందేశాల్లో తెలిపారు.