తాజా వార్తలు

 బంగారు బాతుగుడ్డుగా ఐపీఎల్.. 2023-24లో బీసీసీఐకి రూ. 9,741 కోట్ల ఆదాయం!

BCCI Earns 9741 Crore in 2023 24 IPL Contributes 5761 Crore
  • బీసీసీఐ ఆదాయంలో ఐపీఎల్‌దే అధిక వాటా
  • బోర్డులో వందశాతం భాగమైన ఐపీఎల్
  • నిరంతరం పెరుగుతున్న మీడియా హక్కుల విలువ
  • దేశవాళీ ట్రోఫీలను కూడా వాణిజ్యీకరిస్తే మరింత ఆదాయం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 9,741.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒక్కటే రూ. 5,761 కోట్లతో సుమారు 59 శాతం వాటా కలిగి ఉండటం గమనార్హం. ఈ ఆదాయం ఐపీఎల్‌ను బీసీసీఐకి ప్రధాన ఆర్థిక వనరుగా నిలిపింది.

ఐపీఎల్ ఒక వార్షిక ఫ్రాంచైజీ ఆధారిత టీ20 టోర్నమెంట్. 2007లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో పది జట్లు పోటీపడతాయి. ‘ది హిందూ బిజినెస్ లైన్‌’లోని రెడిఫ్యూషన్ రిపోర్ట్ ప్రకారం బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 9,741.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, ఇందులో ఐపీఎల్ రూ. 5,761 కోట్లను సమకూర్చింది.

“2007లో బీసీసీఐ ఒక బంగారు గుడ్డును కనుగొంది.. అదే ఐపీఎల్. ఇది ఇప్పుడు బీసీసీఐలో 100 శాతం భాగం. ఈ టోర్నమెంట్ అత్యుత్తమమైనది. మీడియా హక్కులు నిరంతరం పెరుగుతున్నాయి. ఐపీఎల్ రంజీ ట్రోఫీ స్థాయి ఆటగాళ్లకు కూడా ఆడే అవకాశాన్ని అందిస్తోంది. ఐపీఎల్ తన వృద్ధితో పాటు లాభాలను కూడా ఆర్జిస్తోంది’’అని వ్యాపార వ్యూహకర్త, స్వతంత్ర డైరెక్టర్ లాయిడ్ మథియాస్ ఈ ప్రచురణలో పేర్కొన్నారు.

కాగా, ఐపీఎల్ కాని మీడియా హక్కుల విక్రయం నుంచి, అంతర్జాతీయ టోర్నమెంట్ల బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు సహా బీసీసీఐకి రూ. 361 కోట్లు వచ్చాయి. రెడిఫ్యూషన్ చీఫ్ సందీప్ గోయల్ ప్రకారం బీసీసీఐ ఇంకా తన పూర్తి ఆదాయ సామర్థ్యాన్ని సాధించలేదు. ఎందుకంటే రంజీ ట్రోఫీ భారత్‌లోని అత్యుత్తమ దేశీయ రెడ్ బాల్ టోర్నమెంట్‌. దీంతోపాటు దేశీయ పోటీలను వాణిజ్యీకరించడానికి అపారమైన సామర్థ్యం ఉంది. “బీసీసీఐకి రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, లేదా సీకే నాయుడు ట్రోఫీ వంటి సంప్రదాయ ఫార్మాట్‌లను వాణిజ్యీకరించి, ఐపీఎల్ యేతర ఆదాయాలను పెంచే అపారమైన సామర్థ్యం ఉంది” అని గోయల్ వివరించారు.

Show More

Related Articles

Back to top button