తాజా వార్తలు

నోట్ల కట్టల వ్యవహారం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్ యశ్వంత్ వర్మ

Yashwant Varma Approaches Supreme Court Over Cash Seizure Case
  • మార్చి 14న జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం
  • స్టోర్ రూంలో మంటలు ఆర్పుతుండగా పెద్ద మొత్తంలో కాలిన నగదును గుర్తించిన అగ్నిమాపక శాఖ
  • జస్టిస్ వర్మపై ఆరోపణలు నిజమేనని తేల్చిన కమిటీ
  • అభిశంసన చర్యకు ప్రతిపాదన
  • దానిని నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టుకు జస్టిస్ వర్మ
ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో కాలిన నగదు కనుగొన్న కుంభకోణంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జస్టిస్ వర్మపై మహాభియోగ చర్యను ప్రారంభించాలని గత సీజేఐ సంజీవ్ ఖన్నా మే 8న చేసిన సిఫారసును రద్దు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఈ సిఫారసు తన హక్కులను పూర్తిగా ఉల్లంఘంచేలా ఉందని ఆయన వాదించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం.. జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది, అయితే ఆయనకు ఎటువంటి న్యాయపరమైన పనులు కేటాయించలేదు.

మార్చి 14న జస్టిస్ వర్మ ఢిల్లీ నివాసంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు, స్టోర్‌రూమ్‌లో అగ్నిమాపక సిబ్బంది భారీ మొత్తంలో కాలిన నగదును కనుగొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది అవినీతి ఆరోపణలకు దారితీసింది. ఈ ఘటన తర్వాత అప్పటి సీజేఐ సంజీవ్ ఖన్నా ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన అంతర్గత దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జీ.ఎస్. సంధవాలియా, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ అను శివరామన్ ఉన్నారు.

ఈ దర్యాప్తు కమిటీ తన నివేదికను గత నెలలో సమర్పించింది. జస్టిస్ వర్మ ఇంటిలో డబ్బులు బయటపడిన విషయం వాస్తవమేనని ధ్రువీకరించింది. డబ్బు బయటపడిన స్టోర్ రూం నియంత్రణ ప్రత్యక్షంగా, పరోక్షంగా జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ఉందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలిపింది. ఈ నివేదికను అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపారు. జస్టిస్ వర్మను తొలగించేందుకు మహాభియోగ చర్యను ప్రారంభించాలని సిఫారసు చేశారు.

ఈ ఆరోపణలను జస్టిస్ వర్మ తిరస్కరించారు. నగదు కనుగొన్న గది అందరికీ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ‘‘ఈ నగదును మేము దాచిపెట్టామని లేదా నిల్వ చేశామని సూచించడం పూర్తిగా అసంబద్ధం” అని వాదించారు. తనను బలిపశువుగా చేసే కుట్ర జరిగిందని కూడా ఆయన ఆరోపించారు. ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల ప్రతిపక్ష పార్టీలతో మహాభియోగ చర్యకు మద్దతు కోరేందుకు సంప్రదింపులు జరిపారు. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే రాబోయే వర్షాకాల సమావేశాల్లో మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జస్టిస్ వర్మ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Show More

Related Articles

Back to top button