తాజా వార్తలు

ఢిల్లీ హోటల్లో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy Slams Revanth Reddy Over Secret Deals in Delhi Hotel
  • బనకచర్లపై రేవంత్ అబద్ధాలు మాట్లాడారన్న జగదీశ్ రెడ్డి
  • మన నదులు మనకు లేకుండా కుట్ర చేస్తున్నారని మండిపాటు
  • ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారని ఎద్దేవా
బనకచర్ల ప్రాజెక్టుపై అబద్ధాలు మాట్లాడిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరి నదిని రేవంత్ ఏపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఒక్కో హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ధారాదత్తం చేస్తోందని… తెలంగాణవాదులు భయపడిందే నిజం అవుతోందని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ నీళ్ల కోసం పోరాడారో… ఆ నీళ్లను రేవంత్ రెడ్డి ఏపీకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. మన నదులు మనకు కాకుండా చేసే కుట్ర జరుగుతోందని అన్నారు.

ఢిల్లీ నుంచి ఒక్క ఫోన్ కాల్ రాగానే రేవంత్ రెడ్డి భయపడి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారని… అక్కడ హోటల్లో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది చీకటి ఒప్పందాలు కుదుర్చుకోవడానికా? అని ప్రశ్నించారు.

గోదావరి-బనకచర్లపై రెండు రాష్ట్రాల్లో వేర్వేరు వార్తలు వస్తున్నాయని జగదీశ్ రెడ్డి అన్నారు. రేవంత్ తన పదవి కోసం కోట్లాది తెలంగాణ ప్రజల హక్కులను బలిపెడతారా? అని ప్రశ్నించారు. రేవంత్ చేసిన ద్రోహానికి తెలంగాణవాదుల రక్తం మరుగుతోందని అన్నారు. గురువులు మోదీ, చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ నడుచుకుంటున్నారని… చంద్రబాబు సహాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి మూటలు పంపినా తమకు అభ్యంతరం లేదని… కానీ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Show More

Related Articles

Back to top button