
- జమ్మూకశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరిన రాహుల్, ఖర్గే
- లఢఖ్ ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద చేర్చాలని విన్నపం
- జమ్మూకశ్మీర్ ప్రజల అభ్యర్థన న్యాయసమ్మతమైనదని వ్యాఖ్య
ప్రధాని మోదీకి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరారు. లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్ చేశారు.
జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని గతంలో మీరు హామీ ఇచ్చారని రాహుల్, ఖర్గే గుర్తు చేశారు. గత ఐదేళ్లుగా జమ్మూకశ్మీర్ ప్రజలు పూర్తి రాష్ట్ర హోదా కోసం డిమాండ్ చేస్తున్నారని అన్నారు. వారి అభ్యర్థన న్యాయసమ్మతమైనదని చెప్పారు. గతంలో కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్ర హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని… జమ్మూకశ్మీర్ విషయంలో ఆలస్యం చేయడంలో అంతర్యమేమిటని ప్రశ్నించాయి.