తాజా వార్తలు

జగన్‌ను కలిసిన కరేడు గ్రామ రైతులు… భూసేకరణను అడ్డుకోవాలని వినతి

తెలంగాణన్యూస్:

Jagan Mohan Reddy Meets Karedu Farmers on Land Acquisition Issue
  • కరేడు భూముల్లో సోలార్ పరిశ్రమ
  • ఇటీవలే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో తమ సారవంతమైన భూములను ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు మంగళవారం నాడు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండే తమ సంట భూములను సోలార్ పరిశ్రమకు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని కోరుతూ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.

రైతుల సమస్యలను సావధానంగా విన్న జగన్, అన్నదాతలకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, భూముల పరిరక్షణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ ఇచ్చిన హామీతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

కరేడు గ్రామ రైతులు గత కొంతకాలంగా తమ భూములను ఇండోసోల్ పరిశ్రమకు కేటాయించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వడంతో వారు భగ్గుమన్నారు. అప్పటినుంచి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు జగన్ ను కలిశారు. జగన్ ను కలిసిన సమయంలో రైతుల వెంట కందుకూరు అసెంబ్లీ స్థానం వైసీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా  బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ మాట్లాడారు. “రెండు మూడు నెలలుగా ఈ భూముల గురించి రైతులు పోరాడుతున్నారు. ఏడాదికి రెండు పంటలు పండే భూములు వారి నుంచి లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. రైతులు తమ గోడు జగన్‌ గారిని కలిసి చెప్పుకున్నారు. ఇండోసోల్‌ కంపెనీకి మా ప్రభుత్వ హయాంలో మరో చోట భూములు కేటాయించాం. కానీ మేం కేటాయించిన చోట కాకుండా, ఇండోసోల్ కంపెనీకి ఈ కూటమి ప్రభుత్వం కరేడు వద్ద భూములు కేటాయించింది. దీనిని మేం వ్యతిరేకిస్తాం అని జగన్‌ గారు చెప్పారు. ఇది అన్యాయమన్నారు. రైతులను ఇబ్బంది పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సారవంతమైన భూములు రైతులకే చెందాలి కానీ, ఇలాంటి భూములు ఇవ్వకూడదన్నారు. సాగుకు నిరుపయోగం అయిన భూములు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని జగన్‌ గారు చెప్పారు” అని వివరించారు.

Show More

Related Articles

Back to top button