
- పవన్ కల్యాణ్ పై యాంకర్ శ్యామల విమర్శలు
- సొంత పార్టీకి చెందిన మహిళా నేతకు ఎందుకు న్యాయం చేయలేకపోయారని ప్రశ్న
- జగన్ పై పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు కదా అంటూ ట్వీట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కాలం ఎంత విచిత్రమైనదో చూశారా పిఠాపురం పీఠాధిపతి పవన్ కల్యాణ్ గారూ…” అంటూ వ్యంగ్యంగా ప్రారంభించిన ఆమె, వాలంటీర్లపై గతంలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు, ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావిస్తూ అనేక ప్రశ్నలు సంధించారు.
శ్యామల స్పందిస్తూ, “30 వేల మంది మహిళల అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ వాలంటీర్లపై నింద వేశారు!” అని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు సొంత పార్టీకి చెందిన ఒక మహిళా నేత తమకు జరిగిన వేధింపులపై స్వయంగా పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. “మీరు టీడీపీకి భయపడ్డారో ఏమో గానీ… మొత్తానికి నోరు ఎత్తలేకపోయారు చూశారా..!” అని ఎద్దేవా చేశారు.
గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన సుగాలి ప్రీతి హత్య గురించి జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ పవన్ కల్యాణ్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోయే వారు కదా….? అని శ్యామల గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తన సొంత పార్టీ మహిళా నేతకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోయారని ఆమె నిలదీశారు.