
- జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకు గుర్తింపు తెచ్చాయన్న ముఖ్యమంత్రి
- దేశంలోని వ్యాక్సిన్లలో 33 శాతం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడి
- ఇక్కడి వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు సరఫరా చేశామన్న రేవంత్ రెడ్డి
జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయని, ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన సంక్లిష్ట సమయంలో ఇక్కడి నుంచే వ్యాక్సిన్లను తయారు చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 33 శాతం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. కరోనా సమయంలో ఇక్కడి నుంచి వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలిగామని తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, జీనోమ్ వ్యాలీ ఆసియా ఖండంలోనే ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందిందని అన్నారు. జీవ శాస్త్రాల అభివృద్ధికి అవసరమైన ఎకో సిస్టం హైదరాబాదులో ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.