తెలంగాణన్యూస్:

- హిందూపురం నియోజకవర్గంలో నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిలపై వేటు
- వైసీపీలో తొలి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు
- పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు
వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో ఇద్దరు కీలక నేతలపై వేటు వేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరు నేతలు హిందూపురం వైసీపీలో తొలి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నారు.
పార్టీ ఆవిర్భావ సమయంలో హిందూపురం నియోజకవర్గం తొలి వైసీపీ ఇన్ఛార్జిగా వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణపై నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. 2024లో బాలయ్యపై దీపిక పోటీ చేసి ఓడిపోయారు. దీపికకు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్ మద్దతుగా నిలిచారు.
తాజాగా ఓ కార్యక్రమంలో నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ… 2029 ఎన్నికల్లో వైసీపీ టికెట్ తనకే వస్తుందని బహిరంగంగా ప్రకటన చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఇన్చార్జిగా ఉన్న దీపిక వీరిద్దరిపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో, ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు పడింది.