హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రాబోయే ఆరేండ్లలో ప్రయాణీకుల రద్దీ దాదాపు రెట్టింపు కానుందని జీఎమ్మార్ గ్రూప్ అంచనా వేస్తున్నది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఆర్‌జీఐఏ) జీఎమ్మార్ గ్రూప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

- తెలంగాణ న్యూస్: ఎయిర్‌పోర్టులో రాబోయే ఆరేండ్లలో ప్రయాణీకుల రద్దీ దాదాపు రెట్టింపు కానుందని జీఎమ్మార్ గ్రూప్ అంచనా వేస్తున్నది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (ఆర్‌జీఐఏ) జీఎమ్మార్ గ్రూప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) సీఈవో ప్రదీప్ ఫణికర్ పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2030-31నాటికి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్ ట్రాఫిక్ ఏటా 50 మిలియన్ల (5 కోట్లు)కు చేరవచ్చన్నారు.స్తుతం 29 మిలియన్లు (2.9 కోట్లు)గా ఉండొచ్చని చెప్పారు. ‘దేశంలోని మెట్రో నగరాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎయిర్‌పోర్టుల్లో హైదరాబాద్ ముందున్నది. గత ఏడాది మార్చికల్లా విమానాశ్రయంలో ప్రయాణీకుల రద్దీ 2.5 కోట్లుగా ఉన్నది. ఈ ఏడాది మార్చి ఆఖరుకు 2.9 కోట్లుగా రికార్డు కాగలదు. 2031 మార్చి 31 నాటికి ఇది 5 కోట్లను తాకుతుందని నమ్ముతున్నాం.’ అని ప్రదీప్ తెలియజేశారు. నిజానికి ఇప్పటికే ఏటా 4 కోట్ల ప్రయాణీకుల రద్దీని తట్టుకునేలా ఎయిర్‌పోర్టులో కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధిపర్చినట్టు చెప్పారు. 2008లో 1.2 కోట్ల ప్రయాణీకుల రద్దీ సామర్థ్యంతో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించిన సంగతి విదితమే. కాగా, 2023తో పోల్చితే గత ఏడాది ఎయిర్‌పోర్టుకు 36 లక్షల ప్రయాణీకులు పెరిగారని ప్రదీప్ వివరించారు. ఢిల్లీలో మినహా దేశంలోని మరే ఇతర ఎయిర్‌పోర్టుల్లోనూ ఈ స్థాయి పెరుగుదల లేదని గుర్తుచేశారు.కార్గో టెర్మినల్ విస్తరణఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతమున్న కార్గో టెర్మినల్‌ను దాదాపు రూ.215 కోట్లతో విస్తరించే దిశగా వెళ్తున్నామని, రూ.55 కోట్లతో కొత్తగా మరో టెర్మినల్ నిర్మించబోతున్నామని మొత్తం రూ.370 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామని ప్రదీప్ ఈ సందర్భంగా వెల్లడించారు. నూతన టెర్మినల్‌తో వార్షిక సామర్థ్యం 4 లక్షల టన్నులకు చేరగలదన్నారు. మే నెలలో నిర్మాణం పూర్తి కావచ్చని, జూన్ లేదా జూలైనాటికి అందుబాటులోకి రావచ్చన్నారు. కాగా, ఈ విమానాశ్రయంలో ప్రస్తుతం గంటకు 34-35 విమానాల రాకపోకలు జరుగుతున్నాయని, 42దాకా కూడా వచ్చిపోయే సామర్థ్యం ఇక్కడి రన్‌వేలకు ఉందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) రూ.2,700 కోట్లకుపైగా ఏకీకృత నిర్వహణ ఆదాయాన్ని అందుకున్నామని, ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాబోయే సంవత్సరాల్లో 10 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. అయితే 65-70 శాతం ఏరోనాటికల్ వైపు నుంచే ఆదాయం వస్తున్నదన్న ఆయన ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) 1.80 లక్షల టన్నుల కార్గో రవాణా జరుగవచ్చన్న ఆశాభవాన్ని కనబర్చారు. ఇది గతంతో పోల్చితే 20 శాతం ఎక్కువ. ఇక అంతర్జాతీయ షిప్పింగ్ నుంచే మెజారిటీ ఆదాయం వస్తున్నది. ఎర్ర సముద్రంలో సంఘర్షణలతో ఇంటర్నేషనల్ కార్గో పెరిగిందన్నారు. కాగా, జీహెచ్‌ఐఏఎల్‌లో జీఎమ్మార్ గ్రూప్‌నకు 74 శాతం వాటా ఉంటే.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వాలకు 13 శాతం చొప్పున వాటాలున్నాయి.