- హాజరైన అమిత్ షా, చంద్రబాబు తదితరులు
- అమిత్ షా అన్ని అంశాల్లో వినూత్నంగా ఆలోచిస్తారన్న చంద్రబాబు
- కేంద్రం నుంచి మరింత సహకారం కోరుతున్నామని వెల్లడి
కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో దేశంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. అన్ని అంశాల్లోనూ అమిత్ షా వినూత్నంగా ఆలోచిస్తారని, ఏపీ పునర్ నిర్మాణం విషయంలోనూ కొత్తగా ఆలోచించాలని అమిత్ షా సూచించారని వెల్లడించారు. గత ఎన్నికల్లో 93 శాతం స్ట్రయిక్ రేట్ తో ఏపీలో ఘనవిజయం సాధించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు ఉందన్నారు. ఎన్నికల సమయానికే ఏపీ వెంటిలేటర్ పై ఉందని అన్నారు. కేంద్రం ఆక్సిజన్ అందించడంతో ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడిందని, అందుకు కేంద్రం పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. అయితే, ఏపీ వెంటిలేటర్ స్థితి నుంచి బయటపడినా, ఇంకా పేషెంట్ గానే ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.